![]() |
![]() |

బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి అదితి శర్మ(Aditi sharma). అపోలోనా – సప్నోంకీ ఊంచీ ఉడాన్', 'రబ్ సే హై దువా', 'కాలీరీన్' వంటి హిట్ సీరియళ్లతో పాటు 'ఖత్రోన్ కే ఖిలాడీ 15' షోతో ఆకట్టుకున్న ఈ నటి, తన భర్త అభినీత్ విద్యానంద్ కౌశిక్, అత్త ఉర్మిళా కౌశిక్ (65), మరియు ఆడపడుచు కీర్తి కౌశిక్ (29)లపై ముంబైలోని గోరేగావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కుటుంబం నుండి శారీరక, మానసిక వేధింపులు, గృహహింస, నోటి దూషణలు, అలాగే తన స్త్రీధనాన్ని అక్రమంగా లాక్కున్నారంటూ అదితి తీవ్ర ఆరోపణలు చేసింది.
వీరిద్దరి పరిచయం 2021 జూన్ నెలలో ఓ ఆన్లైన్ యాక్టింగ్ క్లాస్ సమయంలో మొదలైంది. అది కాస్త ప్రేమగా మారి, మూడేళ్ల తర్వాత అంటే 2024 సెప్టెంబర్‌లో గోరేగావ్ వెస్ట్‌లో కలిసి లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉండటం ప్రారంభించారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో 2024 నవంబర్ 12న ఇరువైపులా పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లయిన కొద్ది రోజులకే భర్త వైఖరిలో తీవ్రమైన మార్పులు వచ్చాయని అదితి తన ఫిర్యాదులో పేర్కొంది. ఇంటి ఖర్చులకు భర్త ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా, తన దగ్గర్నుంచే తరచూ డబ్బులు తీసుకునేవాడని, దుస్తుల ఎంపికపై కూడా అనవసర ఆంక్షలు విధిస్తూ వేధించేవాడని తెలిపింది. ఈ వివాదం 2025 జనవరి 1న ఒక కాఫీ కప్పు విషయంలో చిన్నగా మొదలై పెద్ద గొడవగా మారింది. ఆ రోజు నుంచి భర్త అభినీత్ ప్రవర్తన మరీ విపరీతంగా తయారైంది. అదితి ప్రవర్తనపై అనుమానాలు పెంచుకుంటూ, ఆమె ఫోన్‌ను నిరంతరం తనిఖీ చేయడం, వేరే గదిలో పడుకోవడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా ఆమె తన తల్లిదండ్రులతో కూడా మాట్లాడకుండా తీవ్రమైన ఆంక్షలు విధించాడని అదితి వాపోయింది. 2024 నవంబర్ 12 నుంచి 2025 మార్చి 9 వరకు తనపై నరకం లాంటి వేధింపులు సాగాయని ఆమె వెల్లడించింది.
Also read: ఇదేమి ప్రీ రిలీజ్ బిజినెస్ సామీ.. ఊచకోత అంటే అర్ధం ఇదేనా!
మరోవైపు, వివాహ సమయంలో తల్లిదండ్రులు ఇచ్చిన బంగారు గొలుసులు, ఉంగరాలు, డైమండ్ రింగ్, మంగళసూత్రం, గాజులతో సహా పూర్తి పెళ్లి నగల (స్త్రీధనం)ను అత్త ఉర్మిళా కౌశిక్ తన వద్దే ఉంచేసుకుందని, ఎన్నిసార్లు అడిగినా తిరిగి ఇవ్వకుండా వేధింపులకు గురిచేసిందని నటి ఆరోపించింది. అత్త, ఆడపడుచు ఇద్దరూ కూడా భర్త అభినీత్కే మద్దతు ఇస్తూ తనపై నిందలు వేసేవారని తెలిపింది.
ఈ వ్యవహారంపై 2026 జులై 31న గోరేగావ్ పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 3(5) (సమాన ఉద్దేశం), సెక్షన్ 316(2) (నమ్మకద్రోహం), సెక్షన్ 85 (భర్త లేదా బంధువుల ద్వారా క్రూరత్వం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే గతంలో భర్త అభినీత్ కూడా అదితిపై ఆరోపణలు చేస్తూ, 'అపోలోనా' సీరియల్ సహనటుడు సమర్థ్య గుప్తాతో ఆమెకు సంబంధం ఉందని, తమ పెళ్లి కేవలం ఒక 'మాక్ టెస్ట్' అని ప్రచారం చేశాడని తెలుస్తోంది. దీనికి అదితి స్పందిస్తూ, విడాకులకు సిద్ధపడ్డానని, అయితే గృహహింసను ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.
Aditi sharma, Aditi Sharma, Bollywood

![]() |
![]() |